దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నామని అన్నారు. డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
- రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్--నాగపూర్, హైదరాబాద్--బెంగళూరు, హైదరాబాద్--విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మారుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రహదారులు అభివృద్ధికి సూచిక కాబట్టి, గ్రామం నుంచి మండలానికి... మండలం నుంచి జిల్లాకు... జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు పనులు చేపట్టామని తెలిపారు. ఆర్ అండ్ బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీ రాజ్ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.