22-ఏలో 12 కేటగిరీలకు పరిష్కారం.. హైపవర్ కమిటీతో కదలి
22-A land disputes: The Telangana government has announced a 12-point framework to address disputes involving lands listed under Section 22-A. A high-power committee will examine land category, historical records, government orders and ownership claims instead of treating all prohibited properties alike.
22-ఏ నిషేధిత భూముల వివాదానికి ముగింపు పలికే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల్ని ప్రకటించింది. 22-ఏలో ఉన్న భూములన్నింటినీ ఒకే గాటిన కట్టకుండా.. వాటి కేటగిరీ, పాత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, హక్కుల ఆధారంగా సమస్యల్ని పరిష్కరించేందుకు పన్నెండు ప్రధాన అంశాలను గుర్తించి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములు, లేఅవుట్లు, క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి.
22-ఏ జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్లే అవకాశముంది. ఏ భూమి ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్లింది? అది నిజంగా ప్రభుత్వ భూమేనా? ప్రైవేటు పట్టా భూమి అయితే.. ఏ కారణంతో 22-ఏలో చేర్చారు? గతంలో జరిగిన క్రమబద్ధీకరణలు, అనుమతులు, హక్కుల పరిస్థితి ఏమిటి? వంటి అంశాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే విధానాన్ని సీఎం ప్రకటించారు.
22-ఏలో ఉన్న ప్రతి భూమి శాశ్వతంగా నిషేధిత ఆస్తి కాదన్నదే ఈ ప్రక్రియలో కీలక అంశం. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన కొన్ని దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని సీఎం స్పష్టం చేశారు. అభ్యంతరాల కోసం 15 రోజుల సమయం, ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసే విధానాన్ని తెస్తున్నామని అన్నారు.
హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లకు ఊరట
రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపే నిర్ణయం అధీకృత లేఅవుట్ల పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారం.. హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల అనుమతులు పొందిన లేఅవుట్లలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను కొత్త మార్గదర్శకాలతో పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని వారం రోజుల్లో జారీ చేస్తామన్నారు. దీంతో ఇప్పటికే అనుమతులు పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు.
జీవో-59.. 1.22 లక్షల దరఖాస్తులపై కదలిక
ఇప్పటికే ప్రభుత్వ క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఉన్న భారీ సంఖ్యలో దరఖాస్తులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. జీవో-59 కింద సుమారు 1.22 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు 18,590 పెండింగ్ దరఖాస్తులకు ప్రత్యేక పరిష్కార విధానం తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. ఇది నగర, పట్టణ ప్రాంతాల్లో క్రమబద్ధీకరణ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆస్తుల విషయంలో కీలక పరిణామంగా మారనుంది. ఎల్బీ నగర్ ప్రాంతంలోని జీవో-118కు సంబంధించిన భూ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
సింగరేణి ప్రాంతాలకూ ప్రత్యేక కమిటీ
సింగరేణి కోల్ బెల్ట్‌లోని భూముల సమస్యలకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ద్వారా పరిష్కారం చూపే విధానాన్ని ప్రకటించారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలను ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు సీఎం తెలిపారు. కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన భూ హక్కుల సమస్యలకు ఇది కీలకం కానుంది.
నాలా చెల్లించని పట్టా భూములకూ మార్గం
ప్రైవేట్ పట్టా భూములకు నాలా రుసుము చెల్లించని కారణంగా లావాదేవీలు నిలిచిపోయిన కేసులకూ పరిష్కారం ప్రకటించారు. వర్తించే నాలా ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించిన తర్వాత క్రయవిక్రయాలకు మార్గం కల్పించే విధానం ప్రతిపాదనల్లో ఉంది.
అనధికార లేఅవుట్లపై కొత్త క్రమబద్ధీకరణ పథకం
ప్రభుత్వ భూముల్లో ఏర్పడిన ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీల విషయంలో కొత్త క్రమబద్ధీకరణ పథకం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం రికార్డులు, లేఅవుట్ స్థితి, భూమి హక్కుల కారణంగా సమస్యల్లో ఉన్న కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది.
సికింద్రాబాద్ లీజ్‌హోల్డ్ ఆస్తులకు 30 రోజుల్లో కమిటీ
సికింద్రాబాద్ పరిధిలోని లీజ్‌హోల్డ్ ఆస్తులను ఫ్రీహోల్డ్‌గా క్రమబద్ధీకరించే అంశంపైనా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు 30 రోజుల్లో అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
అసైన్డ్, భూదాన్ భూములపై ల్యాండ్ పూలింగ్
స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికుల అసైన్డ్ భూములు, భూదాన్ భూములను పేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాలకు ఉపయోగించేలా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకురావాలనే అంశాన్ని కూడా సీఎం ప్రకటించారు. సమీకరించిన వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదల గృహ నిర్మాణానికి వినియోగించే ఉద్దేశాన్ని ప్రభుత్వం వెల్లడించింది.
రియల్ ఎస్టేట్‌కు అసలు కీలకం ఇదే
ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన అంశం 22-ఏ సమస్యకు ఒకే పరిష్కారం కాకుండా.. భూముల స్వభావం ఆధారంగా కేటగిరీ వారీగా పరిష్కార వ్యవస్థను తీసుకు రావడం. ఒకవైపు 22-Aలో తప్పుగా చేరిన భూములను గుర్తించే ప్రక్రియ.. మరోవైపు ఇప్పటికే అనుమతులు పొందిన హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం.. జీవో-59, జీవో-118 దరఖాస్తులకు పరిష్కారం.. మరోవైపు సింగరేణి, లీజ్‌హోల్డ్, అసైన్డ్, అనధికార లేఅవుట్లకు ప్రత్యేక విధానాలు.. ఇలా భూ సమస్యలను ఒక్కొక్క కేటగిరీగా విడదీసి పరిష్కరించే కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది.
అయితే 22-ఏ జాబితా నుంచి ఏ భూమి ఎప్పుడు తొలగించబడుతుంది, ఏ భూమికి ఏ నిబంధన వర్తిస్తుంది అన్నది ప్రభుత్వం జారీ చేసే కొత్త మార్గదర్శకాలు, కమిటీల పరిశీలన, తుది ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. మొత్తంగా.. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన 12 అంశాల కార్యాచరణ అమల్లోకి వస్తే, ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకున్న అనేక భూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం ప్రకటించనున్న గైడ్ లైన్స్, హై పవర్ కమిటీ నిర్ణయాలు, తదుపరి ఉత్తర్వులపైనే ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0