- యాభై నుంచి వంద హాస్టళ్లు
- రిస్క్‌లో వందలాది విద్యార్థుల జీవితాలు
- మున్సిపల్‌కు ముడుపులిస్తే చాలు..
- ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చా?
అంజయ్యనగర్‌లో యాభై గజాల్లో ఆరు అంతస్తుల భవనం కూలిపోయిన సంఘటనను కళ్లారా చూశాం. అయితే, ఇలాంటి అక్రమ నిర్మాణాలు కోకాపేట్లోనూ కొలువుదీరాయనే సంగతి మున్సిపల్ అధికారులకు తెలియదా? ఏదైనా సంఘటన జరిగితే తప్ప సీఎంసీ అధికారులు కళ్లు తెరవరా?
కోకాపేట్‌లో కళ్లు మిరుమిట్లు గొలిపే ఆకాశహర్మ్యాలే కాదు.. 200 గజాల స్థలంలో.. ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల అక్రమ నిర్మాణాల్ని నిర్మిస్తున్నారు. వీటిలో హాస్టళ్లు, పీజీ (పేయింగ్ గెస్ట్)లను నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని నోటరీ స్థలాల్లో కట్టినవి ఉండగా.. మరికొన్ని రిజిస్టర్డ్ భూముల్లో ఉన్నాయి.
అధిక శాతం మంది ఏం చేస్తున్నారంటే.. జి+2 అంతస్తులకు అనుమతి తీసుకుని.. ఆరు నుంచి ఏడు అంతస్తుల్ని వేసేస్తున్నారు. అటువైపు వచ్చే మున్సిపల్ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ.. ఎంచక్కా నిర్మాణాల్ని పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎవరి భయం ఉండదు.
అడిగే ప్రతిఒక్కరికీ సొమ్ము పడేస్తే చాలు.. వాళ్లే అన్నీ మూసుకుని ఉంటారనే విషయం అర్థమైంది. అందుకే, ఎలాంటి భయం, బెరుకు లేకుండా.. ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాల్ని కట్టుకుంటూ పోతున్నారు. రెండు వందల గజాల్లో జి+2 అంతస్తులకు అనుమతి తీసుకుని.. అందులో ఏడేనిమిది అంతస్తుల్ని కడితే.. అక్కడి విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థపై ఎంత ప్రభావం పడుతుంది? సీఎంసీ కమిషనర్ శ్రీజన ఈ ప్రాంతాల్ని సందర్శించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యల్ని తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.