- మరో సొసైటీని ఫ్లాట్ యజమానులు అడ్డుకోలేరు
- కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ
అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులోని కామన్ సౌకర్యాలను మరో సొసైటీకి చెందిన వారు వినియోగించకుండా ఫ్లాట్ యజమానులు అడ్డుకోలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆ సౌకర్యాలను ఇతర దశల (ఫేజ్‌ల) నివాసితులు కూడా వినియోగించుకోవచ్చని రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లో స్పష్టంగా పేర్కొని ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
ఈ మేరకు జస్టిస్ జయంత్ బెనర్జీ, జస్టిస్ తారా విటస్తా గంజు ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. బెంగళూరులోని కోత్నూర్ గ్రామంలో ఆర్య హంస, ఆర్య హంస గ్రాండే పేర్లతో ఒకే బిల్డర్ రెండు ప్రాజెక్టులను అభివృద్ధి చేశాడు. రెండు ప్రాజెక్టులకు వేర్వేరు అనుమతులు, జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు, భూ యజమానులు ఉన్నప్పటికీ.. క్లబ్‌హౌస్, రోడ్లు, మార్గాలు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు తదితర కొన్ని కామన్ సౌకర్యాలను రెండు ప్రాజెక్టుల నివాసితులు ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు.
ఆర్య హంస ప్రాజెక్టు 2015లో పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత పక్కనే ఆర్య హంస గ్రాండే నిర్మాణం జరిగింది. అక్కడి నివాసితులు కామన్ సౌకర్యాలను ఉపయోగించడం ప్రారంభించడంతో మొదటి ప్రాజెక్టు ఫ్లాట్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను మరో సొసైటీకి ఎలా ఉపయోగించనిస్తారని ప్రశ్నిస్తూ న్యాయపోరాటానికి దిగారు.
తొలుత కర్ణాటక రెరా అథారిటీని ఆశ్రయించారు. ఆర్య హంస గ్రాండే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రెరా వారి వాదనను తిరస్కరించింది. దీంతో కర్ణాటక రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినా అక్కడ కూడా అనుకూల తీర్పు రాలేదు. చివరకు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసింది.
సేల్ డీడ్‌లోని క్లాజే కీలకం
ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది 2015 నవంబర్ 3న ఫ్లాట్ యజమానులు చేసుకున్న రిజిస్టర్డ్ సేల్ డీడ్. అందులో ప్రాజెక్టులోని కామన్ సౌకర్యాలు, రోడ్లు, క్లబ్‌హౌస్, వినోద సదుపాయాలను వేర్వేరు దశలకు చెందిన యజమానులు కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నట్లు కోర్టు గుర్తించింది. అందువల్ల ఆ నిబంధనకు విరుద్ధంగా మరో సొసైటీ నివాసితులను అడ్డుకునే హక్కు ఫ్లాట్ యజమానులకు లేదని తేల్చింది.
ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి తన ఇంటిపై ప్రత్యేక హక్కు ఉంటుందని, అయితే కామన్ ఏరియాలు, క్లబ్‌హౌస్ వంటి సదుపాయాలపై అదే తరహా సంపూర్ణ హక్కు ఉండదని హైకోర్టు పేర్కొంది.
కాబట్టి కామన్ సౌకర్యాల వినియోగాన్ని ఇతరులకు అనుమతించే నిబంధనను ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లోని సెక్షన్ 11 కింద చెల్లదని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.
సేల్ డీడ్‌లోని భాగస్వామ్య నిబంధన స్పష్టంగా లేదని, అందువల్ల అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 29 ప్రకారం చెల్లదని ఫ్లాట్ యజమానులు మరో వాదన చేశారు. అయితే ఈ వాదనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. సేల్ డీడ్ రిజిస్టర్ అయి, చెల్లుబాటు అయ్యే పత్రంగా ఉన్నందున దానిలోని నిబంధనలను విస్మరించలేమని పేర్కొంది.